మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి :  మంత్రి సీతక్క

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి :  మంత్రి సీతక్క
  • సరస్​ మేళానుప్రారంభించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. హైదరాబాద్‌‌‌‌లోని హెచ్ఎండీఏ  గ్రౌండ్స్‌‌‌‌లో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్  గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ మేళాను ఆదివారం ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు తయారు చేసే చేనేత, హస్తకళా వస్తువులు, పచ్చళ్లు, చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులకు పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ కల్పించడమే సారస్ మేళా ఉద్దేశమన్నారు.

మహిళలు తమ ఉత్పత్తుల నాణ్యతతోపాటు బ్రాండింగ్, ప్యాకేజింగ్, డిజిటల్ మార్కెటింగ్‌‌‌‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చిన్న వ్యాపారాల నుంచి మొదలుపెట్టి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ రుణాలు, వడ్డీ రాయితీలు, నైపుణ్య శిక్షణతో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సారస్ మేళా ప్రాంగణంలో తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. మహిళలు తయారు చేసిన పలు సంప్రదాయ గ్రామీణ వంటకాలను ఆమె రుచి చూసి అభినందించారు. అనంతరం చిన్నారులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళా సాధికారతకు తోడ్పడాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సెర్ప్  సీఈఓ దివ్య దేవరాజన్, సెర్ప్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.